• Jul 26, 2026
  • NPN Log

    ఇండస్ట్రీలో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఒక హీరోయిన్ స్టార్ గా మారడానికి ఎన్నో ఆటంకాలను దాటుకొని రావాల్సి ఉంటుంది. అలా అన్నీ ఆటంకాలను దాటుకొని ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారింది ప్రియాంకా చోప్రా. ఆమె సినీ కెరీర్‌లో సాధించిన విజయాల వెనుక ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఘోరమైన అనుభవాలను ఎదుర్కొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవన్నీ గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. పరిశ్రమలో కొంతమందిని మెప్పించలేకపోయాననే ఒకే ఒక్క కారణంతో తన చేతిలో ఉన్న అవకాశాలను బలవంతంగా లాగేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

    ఒక ప్రముఖ హాలీవుడ్ పాడ్‌కాస్ట్‌లో ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను కొందరి భావాలతో ఏకీభవించనని, వారు చెప్పినట్లు చేయనని.. ఇతరుల మాదిరిగా వారితో కలవలేననే నెపంతో నన్ను సినిమాల నుంచి తొలగించారు. 2007లో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ, ఆ సినిమా హీరోగారికి నేను నచ్చలేదు. నన్ను పొరపాటున ఎంపిక చేశారని ఆయన అనడంతో.. ఒక్క క్షణంలోనే ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను తీసేశారు. ఆ హీరో డైరెక్ట్ గా నా ముందే చెప్పాడు. ఈ సినిమా వేరే హీరోయిన్ చేస్తుంది. మనం మరో సినిమాలో కలుద్దాం అన్నాడు. ఇలాంటివి నేను చాలా చూశాను.

     

    ఆ స్టార్ హీరో ఇగో వల్ల, కొందరి స్వార్థం వల్ల తనకు దక్కాల్సిన అవకాశాలు చేజారిపోయాయి. అప్పుడే అనుకున్నాను. నా నటనపైనే దృష్టి పెట్టాలని.. అలానే కష్టపడ్డాను. నా కష్టమే నన్ను నిలబెట్టింది. ఇక్కడవరకు తీసుకొచ్చింది. ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి, ఇలాంటి ఎన్నో కుట్రలను, అవమానాలను తట్టుకుని ఈ స్థాయికి వచ్చాను' అని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక వారణాసి సినిమాలో మందాకిని పాత్రలో నటిస్తోంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ప్రియాంక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement