• Nov 01, 2025
  • NPN Log

    అమరావతి : వ్యక్తిగత పర్యటనలో భాగంగా సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ భువనేశ్వరికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ నవంబరు 4న డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 అవార్డు అందించనుంది. అలాగే, హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో లభించిన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును కూడా అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, హిందూజా గ్రూప్‌ కో చైర్మన్‌ గోపీచంద్‌, ఆదిత్య బిర్లా సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్‌ చైర్‌పర్సన్‌ రాజశ్రీ బిర్లా, సన్‌ ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వీ, దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ, వాటర్‌ అథారిటీ ఎండీ సయీద్‌ మహ్మద్‌, హీరో ఎంటర్‌ పైజ్రెస్‌, గోయెంకా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా వంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలనా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.


     

    పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీలు

    లండన్‌లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి లండన్‌లోని పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రవాసాంధ్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరిస్తారు. 6న సీఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

    భువనేశ్వరి ప్రజాసేవకు పట్టం

    ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో చేసిన కృషికి గాను సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భారత్‌లోని ప్రముఖ సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐవోడీ) ఆమెను డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ అవార్డు-2025కు ఎంపిక చేసింది. ఈ అవార్డుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ఏటా ఈ అవార్డులను ఐవోడీ ఎంపిక చేస్తుంది. భువనేశ్వరి నేతృత్వం వహిస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్టు.. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సాయం తదితర అంశాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్‌ విద్యార్థి సహాయ పథకాలు, విపత్తు నిర్వహణ సేవలు, మహిళల ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్నన పొందుతున్నాయి. ప్రత్యేకించి తలసేమియా రోగులకు ఉచితంగా బ్లడ్‌ ట్రాన్స్‌ప్యూజన్స్‌ నిర్వహించడటంతో పాటు దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజానికి చేరువైన భువనేశ్వరి ప్రజాసేవా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.

     

    ప్రతిష్ఠాత్మక బ్రాండ్‌గా హెరిటేజ్‌ ఫుడ్స్‌

    మహిళా నాయకత్వానికి భువనేశ్వరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌కు వైస్‌ చైౖర్‌పర్సన్‌, ఎండీగా ఉన్న ఆమె ఆ సంస్థను పారదర్శకత, సామాజిక బాధ్యతతో నడిపిస్తున్నారు. హెరిటేజ్‌ను దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. సంస్థ ఎదుగుదల, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలతోపాటు కోట్ల మంది వినియోగదారులకు హెరిటేజ్‌ ఉత్పత్తులు చేరువ చేయడంలో భువనేశ్వరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి హెరిటేజ్‌ ద్వారా రైతుల సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలకు గాను దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో భువనేశ్వరి ఒకరని 2013లోనే ఫార్చూన్‌ ఇండియా పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ రంగంలో అత్యుత్తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌కు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో దక్కిన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును ఆ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement