పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ : నగరంలో ఇళ్లలో పనిచేసే వారి జరుగుతున్న దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పనిమనుషుల నియామకంలో యజమానుల అజాగ్రత్తే ఈ నేరాలకు ప్రధాన కారణమని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరించారు. పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దని పోలీసులు సూచిస్తున్నారు. గడచిన రెండేళ్లలో నగరవ్యాప్తంగా దాదాపు 565 సర్వెంట్ థెఫ్ట్ కేసులు నమోదైనట్లు పోలీసుల విశ్లేషణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
నమోదైన మొత్తం కేసుల్లో 65 గ్రేవ్ (తీవ్రమైనవి) కాగా, 500 నాన్ గ్రేవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా ఉంటున్న విద్యార్థులు, వృద్ధులు ఎక్కువగా ఈ ముఠాల బారిన పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జోన్ల వారీగా పరిశీలిస్తే జూబ్లీహిల్స్ జోన్లో అత్యధికంగా 173 కేసులు నమోదు కాగా, సికింద్రాబాద్‌లో 88, ఖైరతాబాద్‌లో 77, గోల్కొండలో 70, రాజేంద్రనగర్‌లో 63, శంషాబాద్‌లో 49, చార్మినార్ జోన్లో 45 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు, విదేశీ మూలాలున్న ముఠాలు పనిమనుషులుగా ఇళ్లలోకి ప్రవేశించి విలువైన ఆస్తులను దోచుకెళ్తున్నట్లు తేలింది.
ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పనిమనుషులను నియమించుకునే ముందు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని, వారి ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, ఫొటో, గతంలో పనిచేసిన ప్రదేశాల వివరాలను తప్పనిసరిగా సేకరించాలని కోరారు. నెల రోజుల పాటు వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో ఎంట్రీ రిజిస్టర్లు, పాస్ సిస్టమ్, సీసీ కెమెరాలు విధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏ చిన్న అనుమానం వచ్చినా లేదా పనిమనిషి అకస్మాత్తుగా కనిపించకుండా పోయినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.









Comments