ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి: PDSU – నాసిరకం వసతులతో విద్యార్థుల ఇబ్బందులు – డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
కణేకల్లు:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ డిమాండ్ చేశారు. కణేకల్లు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించి, 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' అమలు తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ... స్థానిక కళాశాలలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుతున్నారని, అయితే వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నాడు-నేడు' పనులు సగం లోనే ఆగిపోవడం వల్ల తరగతులు నిర్వహించలేక విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. గదులకు ఫ్లోరింగ్, టైల్స్, పెయింటింగ్ పనులు పూర్తి కాలేదని, కూర్చోవడానికి బెంచీలు, రక్షణగా కాంపౌండ్ వాల్ కూడా లేవని మండిపడ్డారు.
అలాగే కళాశాల వేళల మార్పు వల్ల సమయానికి బస్సులు లేక విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, పాత సమయాలనే పునరుద్ధరించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు సురేష్, పవన్, ఆది, యశ్వంత్, ఆనంద్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.










Comments