అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 లో భాగంగా గురువారం ఆసీస్‌తో జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసింది. దీంతో ఆదివారం సౌతాఫ్రికాతో ఫైనల్‌లో తలపడనుంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిమానులకు ఓ క్రేజీ హామీ ఇచ్చాడు. సెమీస్‌లో అజేయంగా సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అందుకు జెమీమా అంగీకరిస్తేనే అని స్పష్టం చేశాడు. ఇంతకు ముందు భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు సన్నీ మైదానంలోనే డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
‘భారత్ వన్డే ప్రపంచ కప్‌ను గెలిస్తే నేను జెమీమాతో కలిసి పాట పాడుతా. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. గిటార్ వాయిస్తూ ఉంటే నేను సింగర్‌గా మారుతా. మేమిద్దరం కొన్నాళ్ల కిందట బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాం. అక్కడ బ్యాండ్ ప్లే అవుతూ ఉంటే మేమిద్దరం జాయిన్ అయ్యాం. జెమీమా గిటార్ ప్లే చేసింది. నేను నా వాయిస్‌తో ఏదో పాడేశా. అందుకే అభిమానులకు హామీ ఇస్తున్నా. మన జట్టు కప్ గెలిస్తే మరోసారి ప్రదర్శన ఇస్తాం. అయితే, ఈ ఓల్డ్‌మ్యాన్‌తో కలిసి ప్లే చేయడం జెమీమాకు ఇష్టం అయితేనే సుమా..’ అని గావస్కర్ సరదాగా వ్యాఖ్యానించాడు.






Comments