నిషేధిత భూముల జాబితా రెడీ
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని నిషేధిత భూముల (22ఎ) జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలో గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ జాబితా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అందుబాటులోకి రానుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 10,953 రెవెన్యూ గ్రామాలకుగాను 10,947 గ్రామాల నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో 10,510 గ్రామాల జాబితాలను అప్‌లోడ్ కూడా చేశారు. కొన్ని జిల్లాల్లో అప్‌లోడ్ చేయకపోవడంపై రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్.. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే సాంకేతికపరమైన ఇబ్బందుల వల్లనే ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చిన ఫార్మాట్‌కు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం ఇచ్చిన ఫార్మాట్‌కు తేడాలు ఉండటం వల్ల అప్‌లోడ్ చేయడం వీలు కాలేదని బదులిచ్చారు. దీంతో రెండు రోజుల వ్యవధిలో 100ు జాబితాలను అప్‌లోడ్ చేయాలని కార్యదర్శి ఆదేశించారు. ఏదైనా గ్రామానికి సంబంధించిన 22ఏ జాబితాను ధ్రువీకరించి.. సంతకం చేయడంలో కలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించడం అధికారుల్లో చర్చనీయాంశమయింది.
96 శాతం అప్‌లోడ్ అయింది..
33 జిల్లాలకు సంబంధించి 10,510 రెవెన్యూ గ్రామాల (96ు) 22ఎ జాబితా అప్‌లోడ్ చేశారు. ఇందులో 5 జిల్లాల్లో మాత్రమే 90ు లోపు అప్‌లోడ్ చేశారు. రాజన్న సిరిసిల్లలో 171 గ్రామాలు ఉండగా.. 93 గ్రామాల వివరాలే అప్‌లోడ్ చేశారు. అక్కడ 54ు అప్‌లోడ్ చేయగా, వరంగల్ జిల్లాలో 58ు అయ్యాయి. ఈ జిల్లాలో 191 గ్రామాలకుగాను 110 గ్రామాల జాబితా అప్‌లోడ్ అయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 199 రెవెన్యూ గ్రామాలు ఉంటే 133 గ్రామాల జాబితాను (67ు) అప్‌లోడ్ చేశారు. కాగా, వంద శాతం అప్‌లోడ్ చేసిన జిల్లాలు 16 ఉన్నాయి. అందులో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, కుమరం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వికారాబాద్, పెద్దపల్లి ఉన్నాయి. కాగా, మరో ఏడు జిల్లాల్లో 99 శాతం జాబితాలను అప్‌లోడ్ చేశారు.
కక్ష సాధింపులకు ఆయుధంగా 22ఎ?
నిషేధిత భూముల జాబితా(22ఎ) రాజకీయ కక్షసాధింపునకు ఒక ఆయుధంగా మారిందనే ఆరోపణ లు బలంగా ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన భూమి ని రాజకీయ కక్షతో నిషేధిత జాబితాలో పెట్టారని, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో నిషేధిత జాబితాలో ఉంచారని.. ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై కోర్టులో 5 వేలకుపైగా పిటిషన్లు దాఖలయ్యాయంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి 22ఎ జాబితాలో చేరిస్తే.. దానిని తొలగించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఏమిటీ 22ఎ జాబితా?
కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చట్టం-1908లో సెక్షన్ 22ఎ అనే నిబంధన ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలు జరగకుండా అడ్డుకోవడం. అక్రమంగా చేతులు మారడం, ఆక్రమణలకు పాల్పడటం, అనధికారిక భవనాలు నిర్మించడం, భూ మార్పిడి వంటి చర్యలకు అవకాశం లేకుండా ఈ సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ప్రభు త్వం నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలతో గెజిట్ ప్రకటన జారీ చేశాక.. ఆ భూములను సబ్ రిజిస్ట్రార్‌లు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ప్రభుత్వమే డీ నోటిఫై చేస్తే తప్ప.. రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు.
ఇందులో ఐదు కేటగిరీలు ఉన్నాయి. అవి..
సెక్షన్ 22ఎ: అసైన్డ్ భూముల క్రయ,విక్రయాలను నిషేధిస్తూ తెచ్చిన 1977 చట్టం ప్రకారం సెక్షన్ 4(1) కింద గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొన్న భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. అమ్మడం, కొనడం నిషేధం.
బి: షెడ్యూల్ ప్రాంతాల్లో భూ బదలాయింపు నియంత్రణ చట్టం 1959 ప్రకారం నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొన్న భూముల క్రయ విక్రయాలు జరగకుండా చూడాలి
సి: పట్టణ ప్రాంతాల్లో (జీహెచ్‌ఎంసీ, మునిసిపాలిటీలు) ఉన్న అనధికారిక లేఅవుట్లు, అనుమతులు పొందని భూముల విక్రయాలను నియంత్రించడం
డి: నీటి వనరుల పరిధిలో ఉండే భూములు.. అంటే చెరువులు, కుంటలు, వాగులు, బావులు, జలాశయాలు, నాలాలు, నదులు వంటి వాటికి 10 మీటర్ల పరిధిలో ఉన్న భూములు క్రయవిక్రయాలు జరగకుండా నిషేధించడం.
ఇ: భూ సేకరణ చట్టం కింద సేకరించిన భూములు. గెజిట్‌లో నోటిఫై చేయని భూములు దీనికి వర్తించవు.







Comments